Pawan Kalyan: మీ 151 మంది ఎమ్మెల్యేలు కూర్చొని 'జగన్ రెడ్డి' గారిని ఏమని పిలవాలో తీర్మానం చెయ్యండి: పవన్ కల్యాణ్

  • 'జగన్ రెడ్డి' గారు అంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారు
  • మరి ఏమని పిలవాలి?
  • సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చెయ్యడం చాలా కష్టం
  • రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని 'జగన్ రెడ్డి' గారు అంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని, అలా కాకుండా ఆయనను ఏమని పిలవాలనే విషయంపై ఆ పార్టీలోని 151 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఓ తీర్మానం చెయ్యాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో 'డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు' పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడ ఉచితంగా ఆహారం అందించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు.

సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చెయ్యడం చాలా కష్టమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చని, నిజ జీవితంలో మాత్రం సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఏ రోజునా రాజకీయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోరుకోలేదని, సామాన్యులకి అండగా నిలబడడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఐదు నెలలుగా పట్టించుకోకుండా, 50 మందిని చంపేసి ప్రభుత్వం ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

రాజకీయ పార్టీగా బాధితులకు జనసేన అండగా ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ పార్టీ వారికి అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను వ్యక్తిగత ద్వేషం లేనివాడినని, తనకు శత్రువులు ఉండరని చెప్పుకొచ్చారు. అయితే, ప్రజల సమస్యల కోసం తాను శత్రుత్వం పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. వారి బాధలు తీర్చని వారిని తాను ప్రత్యర్థులుగా భావిస్తానని వ్యాఖ్యానించారు.


జగన్ తో గానీ, చంద్రబాబుతో గాని తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, కానీ వారి విధివిధానాలు ప్రజలను చంపేస్తుంటే ప్రజల కోసమే తాను వారి మీద శత్రుత్వం పెట్టుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. ఇసుక వారోత్సవాలు చెయ్యడానికి ప్రభుత్వానికి ఐదు నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఇసుక కొరతతో 50 మంది చనిపోయాక మేల్కొన్నారా? అని నిలదీశారు.

మీరు ఎప్పుడైనా పస్తులు ఉన్నారా?

మీరు ఎప్పుడైనా పస్తులు ఉన్నారా? అని వైసీపీ నేతలను పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోజుల తరబడి పస్తులు ఉంటున్నారని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణకు గాని, మిగతా 150 మంది ఎమ్మెల్యేలకు గాని ఆకలి బాధలు తెలుసా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతిని వైసీపీ నేతలు రాజధానిగా వద్దంటున్నారని, మరి వేల ఎకరాలు చంద్రబాబు ప్రజల నుంచి తీసుకుంటుంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏం చేసింది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆ రోజున వారందరూ కూర్చొని ఏకగ్రీవ తీర్మానం చేస్తేనే కదా  అమరావతి రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు.

ఏపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం సరిగ్గా పాలన అందిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం అలా చెయ్యని పక్షంలో తాము చాలా బలంగా పోరాటం చేస్తామని అన్నారు. గతంలో 1,400 మంది చనిపోయారని ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారని, మరిప్పుడు 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడానికి కూడా వైసీపీ నిరాకరిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News