Chandrababu: ఈ ముఖ్యమంత్రికి డబ్బుల పిచ్చి పట్టింది: జగన్ పై చంద్రబాబు విమర్శలు
- ప్రజల ఆస్తులను బలవంతంగా రాయించుకుంటాడేమో
- డబ్బులుంటే చాలు ఎవరేమీ చేయలేరనుకుంటున్నాడు
- నాకు అధికారం ముఖ్యం కాదు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరాహారదీక్ష ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ముఖ్యమంత్రికి డబ్బుల పిచ్చి అని, ప్రజల ఆస్తులను బలవంతంగా ఆయన రాయించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.
ప్రతి ఒక్కడూ తాగేటప్పుడు ఈ ముఖ్యమంత్రి (జగన్)ని తిడుతున్నాడని, తమ రక్తాన్ని తాగుతున్నాడంటూ తాగే వ్యక్తులు కూడా జగన్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు, లాస్ట్ టైమ్ కూడా దొంగ లెక్కలు ఇలాగే రాసుకుని అడ్డంగా దొరికిపోయాడని విమర్శించారు. ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చని అనుకుంటున్నాడని, ఎవరేమీ చేయలేరు, తనకు డబ్బులుంటే చాలని అనుకుంటున్నాడని, డబ్బుల పిచ్చిలో పడిపోయాడని, తన మనుషులందరికీ డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారని జగన్ పై విరుచుకుపడ్డారు.
ప్రజావేదిక కూల్చారని, తన ఇంటిపైకి నీళ్లు తేవాలని లంక గ్రామాలను ముంచేశారని, ‘ఇది తప్పు అని నిలదీస్తే నా మీద దాడి చేస్తారా? అంటూ వైసీపీపై మండిపడ్డారు. ‘నా స్వార్థం కోసం నేను పోరాడడం లేదు. నాకు అధికారం ముఖ్యం కాదు. నాకెందుకు ఇంకా అధికారం? పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా చేసింది నేనే. సమైక్యాంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువగా పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నా’ అని చెప్పుకొచ్చారు.