Rafele: మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్.. 'రాఫెల్'పై పిటిషన్ లు అన్నీ కొట్టివేత... సుప్రీంకోర్టు తీర్పు!
- అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవు
- పాత తీర్పునకు కట్టుబడివున్నాం
- నిబంధనల ప్రకారమే డీల్ కుదిరిందన్న న్యాయస్థానం
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లనూ అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం కొట్టివేసింది. రాఫెల్ డీల్ వెనుక మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడిందని గతంలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, తీర్పును నేడు వెలువరించింది.
ఈ డీల్ వెనుక ఎటువంటి అక్రమాలూ లేవని, నిబంధనల ప్రకారమే డీల్ కుదిరిందని అభిప్రాయపడింది. గతంలో తామిచ్చిన తీర్పునకు కట్టుబడే ఉంటున్నామని స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 14న రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ పై తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, అప్పటివరకూ ఉన్న కేసులను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం, అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ తో పెద్ద ఊరట లభించినట్టయింది.