Yediyurappa: సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఓపిక పట్టండి: యడియూరప్ప
- అభ్యర్థుల ఎంపికపై ఎవరూ మాట్లాడవద్దు
- టికెట్ల కేటాయింపులో హైకమాండ్ దే తుది నిర్ణయం
- కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో ఉపఎన్నికలపై ప్రభావం చూపదు
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక ఆదేశాలను జారీ చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఏ ఒక్కరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్ఠానం గమనిస్తోందని హెచ్చరించారు. అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకు అందరూ ఓపిక పట్టాలని సూచించారు.
టికెట్ల కేటాయింపులో పార్టీ హైకమాండ్ దే తుది నిర్ణయమని యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో నకిలీదని... దాని ప్రభావం ఉపఎన్నికలపై ఏమాత్రం ఉండబోదని చెప్పారు. ఈ సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బెంగళూరులో జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంత వరకు అధికారక ప్రకటన వెలువడలేదు.