Tirumala: పేదలకు మరింత దూరమైన తిరుమల లడ్డూ... ధర రూ. 25 నుంచి రూ. 50కి పెంపు!
- లడ్డూ ధర రెట్టింపు
- రూ. 25 నుంచి రూ. 50కి పెంపు
- అతి త్వరలో వెలువడనున్న నిర్ణయం
తిరుమల శ్రీనివాసుని లడ్డూ ప్రసాదమంటే ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే. ఏడుకొండలూ ఎక్కి స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రతి భక్తుడూ లడ్డూ ప్రసాదం స్వీకరించకుండా కొండ దిగడు. అటువంటి లడ్డూ ధర ఇప్పుడు ఏకంగా రెట్టింపు కానుంది. ప్రస్తుతం లడ్డూల అమ్మకాలు రాయితీలపై సాగుతున్నాయి.
స్వామివారి దివ్య దర్శనానికి (నడక భక్తులు) వచ్చే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. మరో రెండు లడ్డూలను రూ. 25 చొప్పున కొనుగోలు చేయవచ్చు. ధర్మదర్శనం భక్తులకు రూ. 20పై రెండు లడ్డూలు ఇస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఒక్కో టికెట్ పై 2 లడ్డూలు, అదనంగా 2 లడ్డూలను రూ. 25పై కొనుగోలు చేసే సదుపాయం ఉందన్న సంగతి తెలిసిందే.
అయితే, మార్కెట్ ధర ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి రూ. 40 వరకూ ఖర్చు అవుతుండగా, రాయితీ భారం తడిసి మోపెడు అవుతోందన్న ఉద్దేశంలో ఉన్న టీటీడీ, ఇకపై ఒక్కో లడ్డూను రూ. 50కి విక్రయించాలని భావిస్తోంది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక చిన్న లడ్డూను ఉచితంగా ఇవ్వాలని, ఆపై లడ్డూ కావాలంటే రూ. 50 పెట్టి కొనుక్కునేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
నిన్న టీటీడీ బోర్డు సమావేశమైన వేళ, అదనపు ఈఓ ధర్మారెడ్డి, అధికారులతో సమీక్షించి, లడ్డూ ధరల పెంపు విధివిధానాలపై చర్చించారు. ధరల పెంపునకు బోర్డు సభ్యులు అందరూ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, లడ్డూలను రాయితీపై ఇవ్వడం వల్ల గత సంవత్సరం టీటీడీకి రూ. 240 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.