Chandrababu: ఈ తెలివి ముందే ఉంటే కార్మికులు ఆకలి మంటల పాలయ్యేవారు కాదుకదా?: జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • తన దీక్షను చూసి జగన్ ఉరుకులు
  • కాస్తో, కూస్తో ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు పరుగులు
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు

తాను గురువారం నాడు ఇసుక కొరతపై దీక్ష చేపడతానని ప్రకటించగానే, జగన్ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు ప్రకటించిందని, ఈ తెలివి ఏదో ముందే ఉంటే, లక్షలాది మంది కూలీలు ఆకలి మంటల పాలయ్యేవారు కాదని మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పలు జిల్లాల పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తన దీక్షను చూసి ఆందోళనతో ఇసుకను కాస్తో, కూస్తో అందుబాటులోకి తెచ్చేందుకు జగన్ పరుగులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో లారీ ఇసుకను రూ. 80 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, రాష్ట్రంలోని ఇసుకను వైసీపీ నేతలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తీసుకెళుతూ, కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కమిటీని వేస్తున్నామని ప్రకటించిన చంద్రబాబు, ఇసుక కొరతపై బొండా ఉమ, అచ్చెన్నాయుడు, రామానాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి, అఖిలప్రియ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బండారు సత్యనారాయణమూర్తిలతో కమిటీని వేశారు. కాగా, రేపు విజయవాడ ధర్నా చౌక్ లో ఉదయం నుంచి రాత్రి వరకూ 12 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్షకు దిగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News