Chandrababu: పెట్టుబడులు పెట్టేవాళ్లను బెదిరించి తరిమేశారు... రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్ గా మార్చారు: చంద్రబాబు విసుర్లు
- వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
- ఉద్యోగాల్లో ఉన్నవాళ్లను తీసివేయడం ఏంటన్న చంద్రబాబు
- గతంలో ఎప్పుడైనా ఈ దుష్టవిధానం ఉందా అంటూ ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పన చేసేవాళ్లను బెదిరించి తరిమేశారని ఆరోపించారు. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి కల్పన పడకేశాయని మండిపడ్డారు. అయినా, ఉద్యోగంలో ఉన్నవాళ్లను తీసేసి వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించడం ఏంటని ప్రశ్నించారు.
"తెనాలిలో అబ్దుల్ రజాక్ అనే మైనారిటీ వర్గానికి చెందిన దివ్యాంగుడు వైసీపీ వాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఉద్యోగంలో ఉన్నవాళ్లను ఉన్నట్టుండి తీసేసే ఈ కొత్త సంప్రదాయం ఏంటని అడుగుతున్నాను. వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఉన్నవాళ్లను తీసేస్తారా? గతంలో ఎప్పుడైనా ఉందా ఈ దుష్ట విధానం? రాష్ట్రంలో ఇన్ని ఆత్మహత్యలు ఎప్పుడైనా చూశామా? కొత్తగా ఉద్యోగాలు కల్పించడం చేతగాని మీకు ఉన్నవాళ్లను తొలగించే హక్కు ఎవరిచ్చారు? 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్ మార్చి పరువు తీశారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.