Maharashtra: మహారాష్ట్రలో ఎమ్మెల్యేలంతా బిజీ... బీజేపీ కోర్ కమిటీ మీటింగ్, రిసార్టుకు బయలుదేరిన ఉద్ధవ్!

  • అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
  • అయినా మెజారిటీ లేక అవస్థలు
  • పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ,శివసేన ప్రయత్నాలు

మహారాష్ట్రకు జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు దూరంగా నిలిచిన బీజేపీ, ఇప్పుడు ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ దుష్యంత్ సింగ్ కొఠారీ ఆహ్వానించగా, బల నిరూపణకు మరింత సమయం తీసుకుని, ఈలోగా శివసేనతో విభేదాలు పరిష్కరించుకోవాలని భావిస్తోంది.

తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు నేడు బీజేపీ కోర్ కమిటీ ముంబైలో సమావేశం కానుందని ఆ పార్టీ నేత చంద్రకాంత్ పాటిల్ వెల్లడించారు. ఇదే సమయంలో పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకుని, మహారాష్ట్ర పీఠంపై మరోమారు శివసేన నేతను సీఎం చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే, రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను నేడు కలిసి చర్చించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వారిని ఉంచిన హోటల్ కు వెళ్లి, సాయంత్రం వరకూ అక్కడే ఉంటారని సమాచారం. ఇదే సమావేశంలో ఆ పార్టీ యువనేత, సీఎం పదవిని కోరుకుంటున్న ఆదిత్య థాకరే కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆయన నిన్న రాత్రి నుంచే హోటల్ లో మకాం వేసి, అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు.

ఇక రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ సైతం, బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆ పార్టీ నేతలు, బల పరీక్ష జరిగితే, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇప్పటికే తేల్చి చెప్పింది. శివసేనకు అవకాశం వస్తే, తాము మద్దతుగా నిలుస్తామని సంకేతాలు పంపింది. ఇక శివసేన ప్రభుత్వం బలం లేక కుప్పకూలకుండా బయటి నుంచి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సైతం సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, శరద్ పవార్, సోనియాగాంధీలు రేపు న్యూఢిల్లీలో సమావేశమై ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News