Telangana: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం ఆగదు: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
- రేపటి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కొనసాగుతుంది
- ఐఏఎస్ లను కోర్టులో నిలబెట్టిన ఘనత తెలంగాణదే
- హైకోర్టు సీరియస్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
ఆర్టీసీ జేఏసీ రేపు చేపట్టనున్న చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కొనసాగుతుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని హయత్ నగర్లో చలో ట్యాంక్ బండ్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం ఆగదని ఈ సందర్బంగా ఆయన అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణలో హైకోర్టు సీరియస్ అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఐఏఎస్ లను కోర్టులో నిలబెట్టిన ఘనత తెలంగాణదేనని చెప్పారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఆత్మ గౌరవం, స్వయంపరిపాలన అన్నారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవిధంగా లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.