Chandrababu: జీవో 2430ని ఉపసంహరించుకోవాలన్న ఎడిటర్స్ గిల్డ్... హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
- జీవో 2430 తీసుకువచ్చిన సర్కారు
- ప్రభుత్వంపై విమర్శలు
- స్పందించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
రాష్ట్రంలో మీడియాపై నియంత్రణ కోసం ఏపీ సర్కారు విడుదల చేసిన జీవో 2430పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. ఇలాంటి చట్టాలతో మీడియాను కట్టడి చేయాలనుకోవడం సరికాదని, ఈ జీవోను వెనక్కితీసుకోవాలని కోరుతున్నామని ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
మీడియాపై పెత్తనం చేసేందుకు ఉద్దేశించిన అనేక చీకటి చట్టాలపై గట్టిపోరాటం చేసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై తనకు అపార గౌరవం ఉందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో అనేక పర్యాయాలు విజయవంతమైన ఎడిటర్స్ గిల్డ్ ఇప్పుడు జగన్ సర్కారు ఇచ్చిన జీవో 2430పై గళం విప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఎడిటర్స్ గిల్డ్ కు ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తున్నామని, ఆ జీవో ఉత్తర్వులు వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేదిలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.