BJP: మహారాష్ట్రలో 'రాష్ట్రపతి పాలన' విధించే అవకాశాల్లేవు... ఎలాగో చెప్పిన నిపుణుడు

  • మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది
  • ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు ఉంటుంది
  • ఒకవేళ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోలేకపోతే శివసేనకి అవకాశం
  • రాజ్యాంగబద్ధ ప్రక్రియ పూర్తిగా కొనసాగితేనే రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతుండడంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజ్యాంగ నిపుణుడు, మహారాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ శ్రీహరి అనెయ్ తన అభిప్రాయాలను తెలిపారు. 'మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనబడట్లేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది' అన్నారు.

'మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ వారు ప్రభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో నిర్ణీత కాల వ్యవధిలో మెజార్టీ నిరూపించుకోలేకపోతే, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు రెండో అతి పెద్ద పార్టీ (శివసేన) కి ఉంటుంది. ఈ రాజ్యాంగబద్ధ ప్రక్రియ మళ్లీ కొనసాగుతుంది' అని శ్రీహరి అనెయ్ తెలిపారు.

'ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు గవర్నర్ తన ముందున్న అన్ని అవకాశాలు ఇచ్చి, ప్రక్రియలన్నింటినీ ముగించాక కూడా ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారు. బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా ఓటర్లు తీర్పునిచ్చారు. ఆ పార్టీలు కలిసి పనిచేయాలని ప్రజలు భావించారు. అయితే, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలన్న (సీఎం అంశంపై) విషయంపై ఆ ఇరు పార్టీలు వాదనలు చేసుకుంటుండడం దురదృష్టకరం' అని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీకి మహారాష్ట్రలో 105, శివసేనకి 56 సీట్లు దక్కాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News