Maharashtra: 15 రోజులు కాదు.. నెల రోజులు తీసుకోండి: బీజేపీపై శివసేన సెటైర్లు
- ప్రభుత్వ ఏర్పాటుకు ఈ అర్ధరాత్రితో ముగుస్తున్న డెడ్ లైన్
- బీజేపీ-శివసేనల మధ్య కుదరని సంధి
- మహారాష్ట్రలో కొనసాగుతున్న టెన్షన్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీపై శివసేన విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. శాసనసభ కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో... బీజేపీపై శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని... దీని కోసం 15 రోజులు కాదు... నెల రోజులు తీసుకోవచ్చంటూ సెటైర్లు వేశారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన బీజేపీ-శివసేనల మధ్య సంధి కుదరలేదు. 50:50 ఫార్ములాకు కట్టుబడి తమకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని ఇవ్వాలని, అది కూడా తొలి అవకాశం తమకే ఇవ్వాలని శివసేన చేసిన డిమాండ్ కు బీజేపీ ఒప్పుకోలేదు.
సీఎం పదవి తప్ప వేరే డిమాండ్లు ఏవైనా సరే ఒప్పుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రెండు పార్టీల మధ్య అంతరం పెరిగింది. ఎన్సీపీ మద్దతు కోసం శివసేన యత్నించినప్పటికీ... ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షంలోనే కూర్చుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మహా టెన్షన్ కొనసాగుతోంది.