Chinarajappa: పాదయాత్ర చేస్తున్నప్పుడే భూములపై జగన్ కన్నేశారు: చినరాజప్ప
- అప్పుడు గుర్తించిన భూములను ఇప్పుడు అమ్మేందుకు యత్నిస్తున్నారు
- ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు
- అమరావతి అభివృద్ధిని కావాలనే వదిలేశారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే భూములపై జగన్ కన్నేశారని ఆరోపించారు. అప్పుడు గుర్తించిన భూములను ఇప్పుడు అమ్మేందుకు పథకం పన్నారని విమర్శించారు. కావాలనే ఇసుక కొరతను సృష్టించారని, ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే... కేవలం నలుగురికి మాత్రమే నష్టపరిహారం ప్రకటించారని దుయ్యబట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ లను న్యాయవాదులతో కలసి పరిశీలిస్తామని... ఆ తర్వాత ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ కు నివేదికను అందిస్తామని చినరాజప్ప తెలిపారు. అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని... కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన తీరు సరికాదని అన్నారు. అమరావతి అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం కావాలనే వదిలేసిందని విమర్శించారు.