Tirumala: పేదలు, దిగువ మధ్య తరగతికి దూరమైన తిరుమల వసతి!

  • అద్దె గదుల ధరను భారీగా పెంచిన టీటీడీ
  • రూ. 100 లేకుంటే రూ. 1000 పెట్టాల్సిందే
  • ఇక వ్యయ ప్రయాసలు తప్పదంటున్న భక్తులు

తిరుమల... కలియుగ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం. నిత్యమూ దాదాపు లక్ష మంది వచ్చి పోతుంటారు. వారిలో అందరూ కొండపై కనీసం ఒక్క రాత్రయినా నిద్రపోవాలని భావిస్తారు. ఒక్క రూమ్ దొరికితే చాలనుకుంటారు. రూమ్ దొరక్కుంటే, రోడ్డుపైనే పడుకుంటారు. సామూహిక వసతి గృహాలను ఆశ్రయిస్తుంటారు. సాధారణ పరిస్థితుల్లోనే, ముందుగా ఏర్పాటు చేసుకోకుండా తిరుమలకు వస్తే, అద్దె గదులు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు అది మరింత క్లిష్టతరమైంది.

తిరుమలలో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఇక అద్దె గదులు దొరికే అవకాశాలు తగ్గిపోయాయి. నిన్నటివరకూ రూ. 500 నుంచి రూ. 600 వరకూ ఉన్న గదుల అద్దెను ఏకంగా రూ. 1000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో రూ. 100కు లభించే సాధారణ గదుల అద్దెలను మాత్రం అలానే ఉంచింది. అయితే, రూ. 100 గదులు ఎంతమందికి అందుబాటులో ఉంటాయన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

తిరుమలలో రూ. 100 అద్దె గదులు దాదాపు 500 వరకూ అందుబాటులో ఉంటాయి. ఇంటికి నలుగురు చొప్పున వేసుకున్నా, అవి 2 వేల మందికి మాత్రమే సరిపోతాయి. ఈ పరిస్థితుల్లో పేదలకు నిలువ నీడ ఎక్కడుంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, తమ మొక్కులను తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చే పేదలు, సర్వదర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. టీటీడీ నిర్ణయంతో వారికిక క్యూలైన్లే వసతిగా మారే పరిస్థితి ఏర్పడింది.

ఇక దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి కూడా అంతే. రెండేళ్ల క్రితం రూ. 350 గా ఉండే పాంచజన్యం అద్దె గదుల ధర ఇప్పుడు రూ. 1000కి పెరిగింది. రూ. 500గా ఉండే కౌస్తుభం తదితర వసతి సముదాయాల్లోనూ అద్దె రూ. 1000 అయింది. తిరుమలకు వచ్చే వారికి చార్జీలు, ఖర్చులు ఎలానూ తడిసి మోపెడవుతాయి. ఎంఆర్పీకి ఏ వస్తువూ లభించదు. కనీసం టీ తాగాలన్నా రూ. 10 నుంచి రూ. 20 వరకూ పెట్టాల్సిందే. టిఫిన్ చేయాలన్నా రూ. 50 వరకూ వదిలించుకోవాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు తిరుమలకు వెళితే, ప్రయాస లేకుండా స్వామి దర్శనం దుర్లభమే.

Tirumala
Tirupati
TTD
Rented Rooms
  • Loading...

More Telugu News