Kanna: ఎటువంటి చర్చ లేకుండానే ఇంగ్లీషు మీడియం అమలు చేస్తారా?: సీఎం జగన్ కు కన్నా లేఖ

  • రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం  
  • స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్
  • గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అనుకూలించదని వ్యాఖ్యలు

ఏపీలోని అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించడం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు. నిర్బంధ ఇంగ్లీషు బోధనతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎటువంటి చర్చ జరపకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మాతృభాష వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

తెలుగులో చదువుకున్న వారు ఇంగ్లీష్ మీడియంలో చదవడమంటే అసాధ్యమేనని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంగ్లీషు అనుకూలం కాదని వెల్లడించారు. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మరింత కష్టతరం అవుతుందని కన్నా అభిప్రాయపడ్డారు. పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక పాఠశాల మానేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తద్వారా అక్షరాస్యత, విద్యాప్రమాణాల్లో మరింత అద్వానస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అయినా, ఇన్నాళ్లూ తెలుగులో బోధించిన గురువులు ఇంగ్లీష్ లో బోధించగలరా? అని సందేహం వ్యక్తం చేశారు.

ఇంతటి కీలక అంశంలో ముందస్తు శిక్షణ, ప్రణాళిక లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని అందరూ కోరుతున్నారని, అలాంటి తరుణంలో ప్రభుత్వ బడులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, భావితరాలను ప్రభావితం చేసే ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కన్నా హితవు పలికారు. ప్రజల మనోభావాలను, గ్రామీణ విద్యార్థులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News