Nara Lokesh: "తెలుగు లెస్సేనా!", "ఎందుకింత తెగులు..?" అని రాశారు, కూశారు... ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?: నారా లోకేశ్
- అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయం
- ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
- ఏం వెలగబెట్టారని హఠాత్తుగా ఈ నిర్ణయం అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ నిర్ణయించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో ఏం వెలగబెట్టారని హఠాత్తుగా రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు? అంటూ మండిపడ్డారు.
అప్పట్లో టీడీపీ సర్కారు నగరపాలక పరిధిలోని స్కూళ్లలో విద్యార్థుల సమ్మతితో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తే, "తెలుగు లెస్సేనా!", "ఎందుకింత తెగులు..?", "ఏకపక్ష నిర్ణయం", "విద్యకు దూరమయ్యే ప్రమాదం", "మాతృభాషపై అంత అక్కసు ఎందుకో", "డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి", "విద్యార్థులకు నష్టమే" అని జగన్ గారి బ్లాక్ పేపర్ రాసింది. వాటినే వైసీపీ నేతలు కూశారు.ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి?
ముందస్తు అధ్యయనం, ప్రణాళికలు అక్కర్లేదా? ఎలాంటి కసరత్తు లేకుండా ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చడం జగన్ గారి మరో అనాలోచిత నిర్ణయంగా భావిస్తున్నాం. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలి. ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి" అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.