Chandrababu: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టుంది జగన్ తీరు: చంద్రబాబు
- సీఎం జగన్ ను నీరో చక్రవర్తితో పోల్చిన చంద్రబాబు
- ఏపీలో పాలన కుంటుపడిందని వ్యాఖ్యలు
- రాష్ట్రం ఆర్థికభారంతో కునారిల్లుతోందని వెల్లడి
ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలనా విధానం సరిగా లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఏపీలో గత ఐదు నెలలుగా పాలన కుంటుపడడంతో రాష్ట్రం ఆర్థికభారంతో సతమతమవుతోందని, మరోవైపు భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్రం ఇంతగా రగిలిపోతుంటే జగన్ తన విలాసవంతమైన ఇంట్లో కూర్చుని వీడియో గేములు ఆడుకుంటూ బిజీగా ఉన్నారని విమర్శించారు. జగన్ తీరు చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ నివాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.15.65 కోట్లు తరలి వెళ్లడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.