CRPF: సీఆర్‌పీఎఫ్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. పలువురు మావోయిస్టులు, ఒక జవాను మృతి!
- పలువురు మావోయిస్టులు చనిపోయినట్టు అనుమానం
- చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిజాపూర్ అటవీ ప్రాంతంలో ఘటన
- ఈ తెల్లవారు జామున ఎదురుపడిన దళాలు
సీఆర్‌పీఎఫ్ జవాన్లు, మావోయిస్టుల మధ్య ఈరోజు తెల్లవారు జామున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 151వ బెటాలియన్‌కు చెందిన ఓ జవాను మృతి చెందగా, పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా తంగుదా-పమేద్ ప్రాంతంలో కమాండోలు, కోబ్రా, చత్తీస్‌ఘడ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఎదురు పడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆత్మసంరక్షణార్థం పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు.
ఇరువైపులా చాలాసేపు సాగిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు చనిపోగా, పలువురు మావోయిస్టులు హతమయ్యారని భావిస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, వివరాలు తెలియాల్సి ఉందని అదికారులు స్పష్టం చేశారు.