Srikakulam District: చేతిలో పెట్రోల్ బాటిల్ తో వచ్చి... "లంచం కావాలా?" అంటూ మహిళా ఉద్యోగినికి రైతు బెదిరింపు!
- రెవెన్యూ ఉద్యోగులకు పెరిగిన బెదిరింపులు
- నిప్పంటించి, తానూ చస్తానని వ్యక్తి హెచ్చరిక
- శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలంలో ఘటన
- వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ధర్మాన
తెలంగాణలో తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం తరువాత, చాలా ప్రాంతాల్లో రెవెన్యూ ఉద్యోగులకు బెదిరింపులు పెరిగిపోయాయి. తాజాగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో రైతు భరోసా సభ నిర్వహించగా, ఓ రైతు పెట్రోల్ బాటిల్ తీసుకు వచ్చి మహిళా ఉద్యోగినిని బెదిరించాడు. పంచాయతీ కార్యదర్శిని పనిచేస్తున్న జే సుమలత వద్దకు వచ్చిన అల్లు జగన్ మోహన్ రావు అనే వ్యక్తి, తన పొలంలో మురికి కాలువ తవ్వించారని, ప్రభుత్వ సాయం అందకుండా చేస్తున్నారని, లంచం అడుగుతున్నారని దూషించాడు.
ముందుగానే బ్యాగులో ఉంచుకున్న పెట్రోల్ బాటిల్ ను బయటకు తీసి, దాన్ని పోసి అంటించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగగా, అక్కడున్న వారంతా హడలిపోయారు. ఆ వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ అక్కడున్న అధికారులు, ఇతరులపైనా పడింది. ఈలోగా అతను అగ్గిపెట్టెను తీయడంతో, మరింత ఆందోళనకు గురైన సదరు మహిళా అధికారిణితో పాటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరుగులు తీశారు.
జరిగిన ఘటనపై పంచాయతీ కార్యదర్శి సుమలత, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, రైతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీపీవో సమీక్ష నిర్వహించగా, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఫోన్ లో సుమలతను పరామర్శించారు. అధైర్యపడవద్దని, నిర్భయంగా విధులు నిర్వహించాలని, తప్పులు జరగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.