ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో... ‘వైన్’ పై పరిశోధనలు
- ఐఎస్ ఎస్ కు చేరుకున్న డజన్ వైన్ బాటిళ్లు
- ఏడాది తర్వాత తిరిగి భూమికి
- అంతరిక్షంలో వైన్ తయారీ ప్రక్రియపై అధ్యయనం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ ఎస్) లో ‘వైన్’ పై ప్రయోగాలను పరిశోధకులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 12 వైన్ బాటిళ్లను ఐఎస్ ఎస్ కు పంపారు. లక్జెంబర్గ్ స్టార్టప్ కార్గో అన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బోర్డియక్స్, బవేరియాలోని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేయనున్నారు. ఐఎస్ ఎస్ చేరుకునే సమయంలో వైన్ బాటిళ్లు పగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
నార్త్ రోప్ గ్రుమన్ క్యాప్సూల్ మాధ్యమంగా వర్జీనియా నుంచి వీటిని శనివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రవాణా చేయగా క్యాప్సూల్ సోమవారం అక్కడికి చేరుకుంది. అంతరిక్షంలో వైన్ తయారీ ప్రక్రియ( కిణ్వనం) ఎలా ఉంటుందన్న విషయంపై పరిశోధకులు దృష్టి పెట్టనున్నారు. స్పేస్ లో నిల్వ ఉంచిన వైన్ ను , భూమిపై బోర్డియక్స్ వైన్ తో పోల్చి నాణ్యతను పోల్చిచూడనున్నారు. వైన్ తయారీలో ఈస్ట్, బ్యాక్టీరియాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో.. అంతరిక్షంలో అవి ఏ విధంగా తమ పని కొనసాగిస్తాయన్న దానిపై పరిశోధకులు తమ దృష్టి నిలుపనున్నారు.
వైన్ ను ఐఎస్ ఎస్ లో ఏడాది పాటు నిల్వ ఉంచిన తర్వాత భూమికి తిరిగి పంపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. వైన్ సహా ఇతర ఆహారాల్లో రుచికరమైన మార్పులు తీసుకొచ్చేందుకు తమ పరిశోధనలు తోడ్పడతాయని తెలుపుతున్నారు. కాగా, గతంలో బడ్ వైజర్ సంస్థ బార్లీ గింజలు, జపనీస్ కంపెనీ విస్కీ, మద్యంను ఐఎస్ ఎస్ కు పంపిన విషయం తెలిసిందే.