Paruchuri: రచయితలకి విలువనిచ్చే గొప్ప మనసున్న వ్యక్తి చిరంజీవి: పరుచూరి గోపాలకృష్ణ
- చిరంజీవిగారికి మేమంటే ఎంతో ఇష్టం
- రచయితలుగా మమ్మల్ని ఎంతో అభిమానిస్తారు
- రామారావుగారు కూడా అంతే ప్రేమను చూపేవారన్న పరుచూరి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, చిరంజీవి గురించి ప్రస్తావించారు. 'రచయితలుగా మాకు చిరంజీవిగారు ఇచ్చిన విలువను మేము జీవితంలో మరిచిపోలేము. ఇటీవల 'సైరా' వేడుకలో వేదికపైకి ముందుగా మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుగారిని ఆహ్వానించారు. ఆ తరువాత పెట్టిన ప్రెస్ మీట్ కి కూడా ముందుగా మా అన్నదమ్ములనే ఆహ్వానించారు.
24 క్రాఫ్టులు కలిగిన సినిమాకి ముందుగా 'శ్రీ' అని రాసి .. 'శుభం' అనే మాటలను రచయితలు రాసిన తరువాతనే, స్టార్ట్ కెమెరా .. క్లాప్ ఇన్ .. స్టార్ట్ సౌండ్ .. యాక్షన్ అనే నాలుగు శబ్దాలు వినిపిస్తాయి. నేను ఎప్పుడో చెప్పిన ఈ మాటలను చిరంజీవిగారు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం విశేషం. 'మీరే కదండీ మా తలరాతలు రాసేది' అనే ఒక అందమైన మాటను ఆయన మొన్న అన్నారు. రామారావుగారు కూడా ఒకసారి మాతో 'మీ చేతుల్లో ఆడే తోలుబొమ్మలం బ్రదర్ మేము' అని అన్నారు. అంత మాట మళ్లీ చిరంజీవిగారు అనడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం" అని చెప్పుకొచ్చారు.