ipl: 2020 ఐపీఎల్ లో ‘పవర్ ప్లేయర్’ నిబంధన
- వినూత్న మార్పులు ప్రవేశపెట్టే యోచనలో బీసీసీఐ
- ఇక జట్టులో 11 మందికి బదులు 15 మంది ఆటగాళ్లు
- పరిస్థితిని బట్టి ఆటగాళ్ల సబ్ స్టిట్యూట్
అభిమానులను ఉర్రూత లూగించే ఐపీఎల్ క్రికెట్ ఫార్మాట్ ను మరింత రసవత్తరం చేసేందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) యోచిస్తోంది. కొత్తగా ఆటగాళ్లకు సంబంధించి ‘పవర్ ప్లేయర్’ విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతీ జట్టు 15 మంది ఆటగాళ్లను ప్రకటిస్తుంది. మైదానంలోకి 11 మంది ఆటగాళ్లు దిగుతారు. మిగతా ఐదుగురిని కూడా ఇరుజట్లు సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓ వికెట్ పడిన తర్వాత లేదా ఓవర్ ముగిసిన తర్వాత ఆటగాళ్లను సబ్ స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ కొత్త విధానంపై ఐపీఎల్ పాలన మండలి భేటీలో చర్చించిన అనంతరం అమల్లోకి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
‘ఇకపై ప్రతి జట్టు 11మంది కాకుండా 15 మందిని ప్రకటిస్తుంది. ఇన్నింగ్స్ లో వికెట్ పడగానే లేదా ఓవర్ ముగియగానే ఒకరిని సబ్ స్టిట్యూట్ గా తీసుకోవచ్చు. ఈ పద్ధతిని ఐపీఎల్ లో ప్రవేశపెట్టే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నాము. ఈ కొత్త నిబంధన ఈ ఫార్మాట్ ను మరింత ఉత్కంఠగా మారుస్తుందనటంలో సందేహం లేదు’ అని బీసీసీఐ పేర్కొంది.
ఈ పవర్ ప్లేయర్ విధానంతో మ్యాచ్ మలుపు తిరిగే అవకాశముంటుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు చివరి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో డగౌట్లో (బెంచ్ మీదున్న ఆడవలసిన ఆటగాళ్లలో) ఉన్న హిట్టర్ క్రిస్ గేల్ ను ఆ సమయంలో సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ చేస్తున్న జట్టు పరంగా చూస్తే.. చివరి ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా ప్రత్యర్థి జట్టును నియంత్రించడానికి డగౌట్ లో ఉన్నబుమ్రాను బౌలర్ గా దించి ఆ ఓవర్ ను వేయించే అవకాశముంటుంది.