Sharada: ఆ క్రెడిట్ ఒక్క శారదకే దక్కిందట!
- శారదకు 'ఊర్వశి' అవార్డు తెచ్చిన 'తులాభారం'
- తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను ఆమెనే నాయిక
- నాలుగు భాషల్లోను సక్సెస్ ను సాధించిందన్న ఈశ్వర్
తెలుగు తెరపై కథానాయికగా శారద స్థానం ప్రత్యేకం. ఈ పాత్రను శారద మాత్రమే చేయగలరు అనుకునే అనేక పాత్రలు ఆమె ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి శారద గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు."శారదగారిలో మంచి నటి ఉందనే విషయాన్ని ముందుగా మలయాళ చిత్రపరిశ్రమవారు గుర్తించారు. మలయాళంలో ఆమె చేసిన 'తులాభారం' సినిమా ఆమెకి 'ఊర్వశి' అవార్డును తెచ్చిపెట్టింది.
ఇదే సినిమాను తెలుగులో 'మనుషులు మారాలి' టైటిల్ తో తీయాలనుకున్నప్పుడు, ఆ స్థాయిలో మరొకరు మెప్పించడం కష్టమేనని భావించిన దర్శక నిర్మాతలు శారదనే ఎంపిక చేసుకున్నారు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆ దర్శక నిర్మాతలు కూడా ఆమెనే కరెక్ట్ అని భావించి తీసుకున్నారు.
ఇక ఇదే సినిమాను హిందీలో 'సమాజ్ కో బదల్ డాలో'గా రూపొందించారు. వాళ్లు కూడా శారద మినహా మరెవరూ చేసినా ఆ పాత్ర తేలిపోతుందని భావించి ఆమెనే ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒకే పాత్రను నాలుగు భాషల్లో శారద చేయడం .. ఆ నాలుగు భాషల్లోను ఆ సినిమా విజయవంతం కావడం విశేషం. ఈ క్రెడిట్ ఒక్క శారదగారికి మాత్రమే దక్కింది" అని ఆయన చెప్పుకొచ్చారు.