Devineni Uma: పక్క రాష్ట్రాల్లో నదులు పొంగుతున్నా ఇసుక కొరతలేదు, ఈ దేవుడి పాలనలోనే కొరత వచ్చిందా?: దేవినేని ఉమ

  • ఇసుక కొరతపై దేవినేని ఉమ వ్యాఖ్యలు
  • ఐదు నెలలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపణలు
  • కార్మికుల ఆత్మహత్యలు సీఎంకు కనిపించడం లేదా అని నిలదీసిన ఉమ

రాష్ట్రంలో ఇసుక దోపిడీ కొనసాగుతోందని, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను పక్క రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తూ ఎన్నికల ఖర్చులు రాబట్టుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఐదు నెలలుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి కనిపించడం లేదా అని ఉమ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించాడు. దీనికేం సమాధానం చెబుతారు? అంటూ నిలదీశారు.

అనంతపురం జిల్లాలో ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నారని, 30 లక్షల మందికి పైగా ఉపాధి కార్మికులు పనుల్లేక అల్లాడిపోతున్నారని అన్నారు. తాడేపల్లిలో నాగరాజు అనే కార్మికుడు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటే ఈ సీఎం ఏంచేస్తున్నట్టు అని ఉమ మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల్లో లేని భవన నిర్మాణ రంగ కార్మికుల బలవన్మరణాలు ఏపీలోనే ఎందుకు జరుగుతున్నాయని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులు ప్రవహించడంలేదా? ఈ దేవుడి పాలనలోనే నదులు పొంగిపొర్లుతూ ఇసుక తీయడం కష్టంగా మారిందా? ఈ రాజన్న రాజ్యంలోనే కొరత వచ్చిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Devineni Uma
Jagan
Andhra Pradesh
YSRCP
Nellore District
Anantapur District
Banglore
  • Loading...

More Telugu News