Sharad Pawar: శివసేనకు మద్దతివ్వడంపై శరద్ పవార్ స్పందన
- మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలంటూ ప్రజలు తీర్పును ఇచ్చారు
- ప్రజల అభీష్టం మేరకు ప్రతిపక్షంలోనే ఉంటాం
- శివసేనకు మద్దతుపై మా పార్టీలో చర్చ జరగనే లేదు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటం... దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. మరోవైపు 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. అసలు ఏం జరగబోతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో, తన అంతరంగాన్ని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకున్నారో... దానికే తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఎన్సీపీ ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని... వారి అభీష్టం మేరకు తాము ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటామని చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... ఈ దిశగా తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ-శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని... కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.