Donald Trump: న్యూయార్క్‌లో మ‌ర్యాద ద‌క్క‌డం లేద‌ంటూ.. ఫ్లోరిడాకు అడ్రస్ మార్చుతోన్న డొనాల్డ్ ట్రంప్‌

  • ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్‌ శాశ్వ‌త చిరునామాగా మార్పు
  • న్యూయార్క్ లో  బిలియ‌న్ల డాల‌ర్లు పన్నుగా చెల్లిస్తున్నానన్న ట్రంప్
  • ఈ న‌గ‌ర రాజ‌కీయ‌వేత్త‌లు స‌రిగా చూడ‌ట్లేదని వ్యాఖ్య

న్యూయార్క్‌లో త‌న‌కు మ‌ర్యాద ద‌క్క‌డం లేద‌ంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్‌ను తన శాశ్వ‌త చిరునామాగా మార్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. న్యూయార్క్ తనకు ఇష్టమేనని.. అయితే, ఇన్నేళ్లుగా అక్కడ పన్నుల రూపంలో తాను బిలియ‌న్ల డాల‌ర్లు చెల్లించినప్పటికీ, ఈ న‌గ‌ర రాజ‌కీయ‌వేత్త‌లు త‌న‌ను స‌రిగా చూడ‌ట్లేదని ఆయన వాపోయారు. శాశ్వత చిరునామా మార్పుపై ఇటీవల మెలానియా ట్రంప్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  

అమెరికా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటానని ట్రంప్ తేల్చిచెప్పారు. తమ దేశాన్ని మరోసారి గొప్ప‌గా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త తనపై ఉందని చెప్పుకొచ్చారు. ఆయన శ్వేతసౌధంతో పాటు మార్ ఏ లాగో రిసార్ట్‌లో ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 'ట్రంప్ టవ‌ర్‌'లో 20 రోజులు ఉన్నారు. కాగా, ప‌న్నుల నుంచి త‌ప్పించుకునేందుకే ఆయన తన చిరునామాను మార్చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News