Andhra Pradesh: వివాదాస్పద జీవో 2430పై ఏపీలో ఆగ్రహ జ్వాలలు.. జర్నలిస్టుల రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీడీపీ మద్దతు
- జీవో 2430ను రద్దు చేసే వరకు పోరాడతామన్న చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్త నిరసనలకు జర్నలిస్టు సంఘాల పిలుపు
- ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
నిరాధార వార్తలు ప్రచురించే సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 2430పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జీవోకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి టీడీపీ మద్దతు ప్రకటించింది. అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టే అధికారం సంబంధితశాఖ అధికారులకు ఇచ్చారని, ఈ జీవోను రద్దు చేసే వరకు తాము పోరాడతామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్లు పిలుపునిచ్చారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.