Nirbhaya: నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష అమలు చేస్తాం: తీహార్ జైలు డైరెక్టర్ జనరల్
- శిక్షను సవాల్ చేయకుంటే అమలు చేస్తాం
- క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతిని కోరే హక్కు వారికి ఉంది
- ఇప్పటివరకు దోషులనుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదు
నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు త్వరలోనే మరణశిక్షను అమలు చేయనున్నట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఈ నెల 28న వారికి తెలియజేశామన్నారు. ఈ మేరకు వివరాలను తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వెల్లడించారు. మరణ శిక్షను సవాల్ చేసే హక్కు, శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చమని రాష్ట్రపతిని క్షమాభిక్ష ప్రసాదించమనే హక్కు వారికి ఉన్నప్పటికి ఇప్పటివరకు వీటిని ఉపయోగించుకోలేదన్నారు.
ఇందుకోసం వారికి వారం రోజులు గడువు ఉందన్నారు. గడువు తేదీ లోగా నేరస్థులు క్షమాభిక్ష కోరడమో లేదా ప్రస్తుత శిక్షను సవాల్ చేయడమో చేయకపోతే.. అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలుపుతామన్నారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరణశిక్ష అమలు చేస్తామన్నారు. ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా, నాలుగో దోషి మండోలీ జైలులో ఉన్నాడని గోయల్ చెప్పారు. వీరికి దిగువ కోర్టు విధించిన మరణ శిక్షలను ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయని ఆయన పేర్కొన్నారు.