Nara Lokesh: మా ఫిర్యాదుల్ని రిజిస్టర్ పోస్టు చేయాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు: లోకేశ్ ఆవేదన
- ఒక పార్టీ ఫిర్యాదులనే స్వీకరిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం
- టీడీపీ ఫిర్యాదులు పక్కనబెడుతున్నారని ఆరోపణ
- చింతమనేనిపై 4 రోజుల్లో 12 కేసులు పెట్టారని మండిపాటు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. తమ నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చింతమనేని ప్రభాకర్ పై కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 12 కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక నాయకుడిపై అన్ని కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ను నిలదీసి మాట్లాడతాడన్న ఒకే ఒక్క కారణంతో చింతమనేనిపై కేసులు బనాయించి జైలుకు పంపారని అన్నారు.
"ఏవైనా ఫిర్యాదులు ఉంటే వచ్చి కేసులు పెట్టండి అని పోలీసులు అంటున్నారు. మరి ఎందుకు ఒక్క వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు? ఫిర్యాదులు ఉంటే అందరిపైనా కేసులు పెట్టవచ్చు కదా! సీఎం జగన్ పైనా కేసులు పెట్టవచ్చు కదా! టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయడం లేదు? మా ఫిర్యాదులు స్వీకరించని కారణంగా రిజిస్టర్ పోస్టులో కంప్లెయింట్ ను పోలీసులకు పంపాల్సి వస్తోంది. ఆఖరికి ఓ ఫిర్యాదును రిజిస్టర్ పోస్టులో పంపాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. కేవలం ఒక పార్టీ ఫిర్యాదులే స్వీకరిస్తూ, టీడీపీ వాళ్లు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడంలేదు. బీహార్ లోని అరాచకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.