Jagan: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

  • నాలుగు గంటలపాటు సాగిన సమావేశం
  • అమ్మ ఒడి పథకానికి ఆమోదం
  • జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు

నాలుగు గంటలపాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఓకే చెప్పింది. 2020 జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలనుకుంటున్న అమ్మ ఒడి పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపునకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరిశోధనశాలలు ఏర్పాటు చేసేందుకు కూడా పచ్చజెండా ఊపింది. దీంతోపాటు రెట్టింపు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును కేబినెట్  ఆమోదించింది. టీడీపీ హయాంలో తీసుకున్న భూ కేటాయింపుల నిర్ణయాల రద్దుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

కృష్ణా, గోదావరి కాల్వలను శుభ్రం చేసేందుకు శుద్ధి మిషన్ ఏర్పాటు, మాల ఫైనాన్స్ కార్పొరేషన్, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్, రెల్లి, ఇతర కులాల కార్పొరేషన్‌గా విభజించడంతోపాటు వివిధ రంగాల్లో ప్రజా సేవ చేస్తున్న వారికి వైఎస్సార్ లైఫ్‌టైం అవార్డులు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్య, సామాజిక సేవ, వైద్యం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడలు తదితర వాటిలో విజయం సాధించి సమాజ హితం కోసం కృషి చేసే వారిని ఎంపిక చేసి ప్రతి యేటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15న 50 మందికి ఈ అవార్డు అందించాలని నిర్ణయించారు.

స్టోన్ క్రషర్ యూనిట్లను గుర్తించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత ఆరు నెలలలోపు కంకర నుంచి రోబోశాండ్ తయారీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్లను పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణల్లో 300 గజాల వరకు క్రమబద్దీకరించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే, తెల్లరేషన్ కార్డు కలిగి వంద గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలన్న కీలక నిర్ణయానికి కేబినెట్ ఓకే చెప్పింది.

  • Loading...

More Telugu News