Pakistan: మృతురాలి దుస్తులపై అబ్బాయి డీఎన్ఏ.. కేసు కోణాన్ని మార్చిన నివేదిక!

  • గత నెల 16న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నిమృత
  • ఆమె దుస్తులపై దొరికన రక్తంలో అబ్బాయి డీఎన్ఏ
  • ప్రియుడే కారణమని అనుమానం

ఇది నిజంగా షాకింగ్ వార్తే. చనిపోయిన యువతి మృతదేహంపై అబ్బాయి డీఎన్ఏ కణాలు బయటపడడం సంచలనమైంది. పాకిస్థాన్‌లో జరిగిందీ ఘటన. సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా జిల్లాకు చెందిన నిమృత కుమారి బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. సామాజిక కార్యకర్త అయిన నిమృత సెప్టెంబరు 16న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ మరుసటి రోజు పోలీసులు డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆమె మృతదేహంతోపాటు, ఆమె దుస్తులపై పడిన రక్తం నమూనాలను జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు.

అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడైన వివరాలు మాత్రం అందరినీ షాక్‌కు గురిచేశాయి. డీఎన్ఏ నివేదికలో అబ్బాయికి సంబంధించిన వివరాలు బయటపడినట్టు పోలీసు అధికారి మసూద్ బంగాశ్ వెల్లడించారు. నివేదిక తర్వాత కేసు విచారణ కోణం మారింది.

అప్పటి వరకు నిమృత ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఎవరో హత్య చేశారంటూ సింద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను విచారించిన కోర్టు ఈ కేసులో జుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాగా, కాలేజీలో గత నెలలో హిందూ ప్రిన్సిపాల్‌తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షి కావడం గమనార్హం.

మరోవైపు, ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న నిమృత సహ విద్యార్థులు మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్ సహా 32 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిమృత సోదరుడు విశాల్ మాట్లాడుతూ తన సోదరిది ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. ఆమె చేతులను బలవంతంగా పట్టుకుని మెడకు కేబుల్ వైరును బిగించి హతమార్చారని ఆయన ఆరోపించారు.

ఇంకోవైపు, నిమృత, మెహ్రన్ అబ్రోలు ప్రేమించుకున్నారని, నిమృత పెళ్లి ప్రస్తావన తీసుకురాడంతో మెహ్రన్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

  • Loading...

More Telugu News