vijayasaireddy: చంద్రబాబు క్రిమినల్ మైండ్ షార్ప్ గా పనిచేస్తోంది: విజయ సాయిరెడ్డి
- ఇసుక దొరక్క కూలీలు పస్తులుంటున్నారని అంటున్నారు
- ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని నింద వేస్తున్నారు
- చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు చంద్రబాబు తీరు
- నిరసన ప్రదర్శనలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేయించే స్కెచ్ వేశాడు
ఐదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పందించారు. 'ఇసుక దొరక్క కూలీలు పస్తులుంటున్నారని అంటాడు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అదే నోటితో నింద వేస్తాడు. పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుందని ఆరోపిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే ఆయన అసలు బాధ' అని ట్వీట్ చేశారు.
'చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబు గారి క్రిమినల్ మైండ్ షార్ప్ గానే పనిచేస్తోంది. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడు. లాంగ్ మార్చో, షార్ట్ మార్చో స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయింది' అని విజయ సాయిరెడ్డి ఆరోపించారు.
'డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో గత చంద్రబాబు ప్రభుత్వం 2015 నవంబర్లో ఎంఓయూలు కుదుర్చుకుంది. వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్ర, ఓలం అగ్రో లాంటి దిగ్గజ కంపెనీలను పిలిపించి సినిమా చూపించాడు. ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి. కానీ, కొనుగోళ్లు జరగలేదు' అని మరో ట్వీట్ లో విజయ సాయిరెడ్డి విమర్శించారు.