Jammu And Kashmir: భారత్ కు పూర్తి మద్దతు పలుకుతున్నాం: జమ్మూకశ్మీర్ లో పర్యటించిన యూరోపియన్ యూనియన్ ఎంపీలు
- జమ్మూకశ్మీర్ లో ముగిసి ఈయూ ఎంపీల పర్యటన
- పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లతో భేటీ
- రాజకీయ నాయకులను నిర్బంధించిన సెంటర్ల పరిశీలన
ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి, శాంతిసామరస్యాలను నెలకొల్పేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న భారత్ కు పూర్తి మద్దతు పలుకుతున్నామని జమ్మూకశ్మీర్ లో రెండు రోజుల పాటు పర్యటించిన 23 మంది యూరోపియన్ యూనియన్ ఎంపీలు స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో మానవహక్కుల హననానికి భారత ప్రభుత్వం పాల్పడుతోందని... అక్కడ ఏం జరుగుతోందో కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదంటూ ఇప్పటి వరకు పెడబొబ్బలు పెట్టిన పాకిస్థాన్ కు ఈయూ ఎంపీల వ్యాఖ్యలు శరాఘాతమే.
కశ్మీర్ లో పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈయూ ఎంపీలు మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఎంపీ మాట్లాడుతూ, ఒక అంతర్జాతీయ ప్రతినిధి బృందంగా తాము అన్ని పరిస్థితులను పరిశీలించామని... భారత ప్రభుత్వం చేపడుతున్న అన్ని చర్యలకు పూర్తి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. భారత ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులు అందించిన ఆతిథ్యానికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.
మరోవైపు, శ్రీనగర్ లో ఎంపీల బృందం అడుగుపెట్టిన వెంటనే జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలు వారికి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. దీనికి తోడు కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లతో డెలిగేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఆ తర్వాత శ్రీనగర్ లోని వీధుల్లో వీరు తిరిగారు. అంతేకాదు డజన్ల కొద్దీ రాజకీయ నాయకులను నిర్బంధించిన సెంటర్లకు కూడా వారిని అధికారులు తీసుకెళ్లారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను నిర్బంధించిన ప్రాంతాలను కూడా చూపించారు.