Harrasment: కట్నం కోసం చిన్నారులు వేధించారట... బాలలపై గుంటూరు పోలీసుల కేసు!
- కోడలిని వేధించిన అత్తమామలు
- వేధించారంటూ నలుగురు పిల్లలపైనా ఫిర్యాదు చేసిన యువతి
- ఇంట్లోని అందరిపైనా కేసు నమోదు
కొత్తగా వచ్చిన కోడలిని ఆ చిన్న పిల్లలు అదనపు కట్నం కోసం వేధించారట. బాధితురాలి ఫిర్యాదుపై 6 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న నలుగురిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన ఘటన గుంటూరులో జరిగింది. ఇదేం న్యాయమంటూ వాపోతున్న ఆ చిన్నారులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడంతో, పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పొన్నెకంటి బిందు అనే యువతికి ఆదరణ కుమార్ అనే యువకుడితో గత సంవత్సరం పెళ్లి జరిగింది. అదనపు కట్నం తేవాలంటూ ఆమెను హింసిస్తుండటంతో, గత నెలలో బిందు, గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామలతో పాటు, ఆడపడుచులు, వారి భర్తలు తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. వారందరిపైనా కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆడపడుచుల పిల్లలు... 6, 6, 9, 11 వయసున్న నలుగురిని కూడా నిందితుల జాబితాలో చేర్చి, వరకట్న వేధింపుల నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించి, పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. చిన్నారులను నిందితులుగా చేర్చడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ కేసు హైకోర్టులో నేడు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.