YSRCP: వైసీపీలో చేరేందుకే వల్లభనేని వంశీ నిర్ణయం?
- రెండు రోజుల క్రితం రాజీనామా
- జగన్ సమక్షంలో చేరిక
- వంశీ రాకను వ్యతిరేకిస్తున్న యార్లగడ్డ
గన్నవరం ఎమ్మెల్యే, రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ, నేడు లేదా వచ్చే నెల 3వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ స్వయంగా వంశీని పార్టీలోకి ఆహ్వానించి, కండువా కప్పుతారని సమాచారం. ఒకవైపు ఆయన పార్టీ మార్పును నిలువరించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నా వంశీ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.
ఇదే సమయంలో వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, తన మనసులోని మాటను జగన్ తో చెప్పేందుకు ప్రయత్నించినా, ఆయన అపాయింట్ మెంట్ లభించలేదు. నిన్న జగన్ పార్టీకి చెందిన ఏ నేతనూ కలవలేదు. దీంతో జగన్ నివాసానికి వెళ్లి చాలాసేపు నిరీక్షించిన యార్లగడ్డ నిరాశతో వెనుతిరిగారు. వంశీ రాజీనామా చేసిన తరువాతనే వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో ఉప ఎన్నికలు వస్తే, ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీకి దిగాలని యార్లగడ్డ భావిస్తున్నట్టు తెలుస్తోంది.