Undavalli: బీజేపీ వాళ్లు ఏమనుకుంటే అది అవుతుంది: జగన్ కేసులపై ఉండవల్లి
- శశికళ విషయంలో ఏం జరిగిందో చూశాం
- మోదీ, షాలకు రాజ్యాంగం అవసరం లేదు
- సీబీఐ అమిత్ షా కంట్రోల్ లోనే ఉందన్న ఉండవల్లి
జగన్ పై ఉన్న 11 కేసుల విషయంలో బీజేపీ ఏం అనుకుంటే అదే జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. శశికళ విషయంలో ఏం జరిగిందో అందరమూ చూశామని, మెజారిటీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి, ఆమె తాను ముఖ్యమంత్రిని అవుతానని అంటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకూ వేచి చూడాలని చెప్పారని, ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు.
మోదీ, అమిత్ షాలకు రాజ్యాంగం గురించి అవసరం లేదని, వారిద్దరూ తాము హిందుస్థాన్ కోసం పుట్టామని నమ్మే వ్యక్తులని అభిప్రాయపడ్డారు. బీజేపీ వాళ్లు ఏమైనా చేస్తారని, ఈ విషయం తనకు జగన్ కేసులో సీబీఐ పిటీషన్ ను చూసిన తరువాత మరింత స్పష్టంగా అర్థమైందని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు రాకుండా మినహాయింపును జగన్ కోరారని గుర్తు చేస్తూ, కోర్టుకు రాకుంటే, ఆయన సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ, ఈడీలు పిటిషన్ దాఖలు చేసిన సంగతిని ప్రస్తావించారు.
దాన్ని చదివిన తరువాత సీబీఐ అంటే, హోమ్ మంత్రి అమిత్ షా కంట్రోల్ లో ఉన్న సంస్థని తెలిసిపోయిందని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ వాళ్లు, అవకాశం దొరికితే జగన్ ను దెబ్బేయాలని చూస్తారని, వాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని, లేకుంటే అంత ఘాటుగా రాయక్కర్లేదని అన్నారు. జగన్ పై వాళ్లకు అభిమానం ఉంటే... శుక్రవారం ఒక్కరోజు కోర్టుకు వెళితే, సాక్షులను ప్రభావితం చేయడనటం, వెళ్లకుంటే చేస్తాడనటం ఏంటని ప్రశ్నించారు. దీన్ని ఎలా జస్టిఫై చేసుకోవాలో అర్థం కావడం లేదని, సాక్షులను ప్రభావితం చేస్తారని భావిస్తే, తీసుకెళ్లి జైల్లో పెట్టవచ్చు కదా? అని ఉండవల్లి అన్నారు.