Telugudesam: టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీ రాజీనామా... చంద్రబాబుకు లేఖ
- టీడీపీకి గుడ్ బై చెప్పిన గన్నవరం ఎమ్మెల్యే
- వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని లేఖ
- భవితవ్యంపై ప్రకటన చేయని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు వల్లభనేని వంశీ తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తనను, తన అనుచరులను కొందరు వైసీపీ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేసినా ఎన్నికల్లో గెలిచానని, ఇప్పటికీ వేధింపులు ఆగలేదని వంశీ తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన తన లేఖలో తెలిపినట్టు సమాచారం. వంశీ ఇటీవలే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు షికారు చేశాయి.
వైసీపీలోకి వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వంశీ హయాంలో వైసీపీ కార్యకర్తలపై అనేక కేసులు నమోదయ్యాయని యార్లగడ్డ అంటున్నారు.అటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితోనూ వంశీ సమావేశం కావడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.