Odisha: ఒళ్లు గగుర్పొడిచే సినిమా స్టోరీ కాదిది! స్నేహితుడిని కోల్పోయి నడి సంద్రంలో 28 రోజుల ప్రయాణం!

  • రూ.5 లక్షల సరుకులతో సముద్రంలోకి బయలుదేరిన అమృత్
  • తుపాన్ల తాకిడికి ధ్వంసమైన బోటు
  • స్నేహితుడి మరణంతో ఒంటరి ప్రయాణం
  • 28 రోజుల తర్వాత ఎట్టకేలకు ఒడ్డుకు

సరుకులతో సముద్రంలోకి వెళ్లి ఆపై తుపాన్లకు గురై దారితప్పి 28 రోజులు నరకయాతన అనుభవించిన ఓ వ్యక్తి ఎట్టకేలకు ఒడ్డుకు చేరాడు. ఈ క్రమంలో తనతోపాటు వచ్చిన స్నేహితుడిని కోల్పోయాడు. శుక్రవారం ఒడిశా తీరానికి చేరుకున్న అతడిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
 అండమాన్‌కు చెందిన  అమృత్‌ కుజుర్‌ (49) సముద్రంలోని నౌకలకు సరుకులు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 28న రూ.5 లక్షల విలువైన సరుకులతో స్నేహితుడు దివ్యరాజన్‌తో కలిసి  షాహిద్‌ ద్వీప్‌ నుంచి మరపడవలో సముద్రంలోకి బయల్దేరాడు. సముద్రం మధ్యలోకి చేరుకున్నాక తుపాను రావడంతో పడవ దెబ్బతింది. ఇంధనం నిండుకుంది. వారివద్ద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పాడవడంతో తాము ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయలేకపోయారు.

మరోవైపు పడవ మునిగిపోయే ప్రమాదం ఉండడంతో ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తాము విక్రయానికి తీసుకొచ్చిన రూ.5 లక్షల విలువైన సరుకులను సముద్రంలో పడేశారు. ఇంకోవైపు, పడవలోని ఇంధనం పూర్తిగా అడుగంటడంతో పడవ ముందుకు సాగని పరిస్థితి. దీంతో సాయం కోసం రోజుల తరబడి ఎదురుచూశారు. ఈలోపు బర్మాకు చెందిన ఓ ఓడ వీరిని గుర్తించింది. ఆపదలో ఉన్న విషయం తెలుసుకుని  260 లీటర్ల డీజిల్‌తోపాటు ఒడ్డుకు చేరుకునేందుకు సహాయకారిగా ఉంటుందని కంపాస్ (దిక్సూచీ) ఇచ్చారు.

దీంతో బతుకు జీవుడా అనుకుంటూ స్నేహితులిద్దరూ సగం పాడైన పడవలోనే ఒడ్డుకు బయలుదేరారు. అయితే, వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వారు ప్రయాణంలో ఉండగానే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో తుపాను వారి ఆశలను చిదిమేసింది. ఆ భీకర తుపానుకు వారి పడవ మరింత ధ్వంసమైంది. పడవలోకి నీళ్లు చేరడంతో  ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.

మరోవైపు, వారం రోజులుగా తిండి, నీరు లేకపోవడంతో అల్లాడిపోయారు. టవల్‌తో వర్షపు నీటిని పట్టుకుని దానిని పిండి కడుపు నింపుకున్నారు. అయితే, ఆకలికి తట్టుకోలేని దివ్యరాజన్ కన్నుమూశాడు. స్నేహితుడి మరణం అతడిని కలచివేసింది. దివ్యరాజన్ మృతదేహంతో అమృత్ ఒడ్డుకు బయలుదేరాడు. అయితే, రెండు రోజుల తర్వాత శవం నుంచి దుర్వాసన వస్తుండడంతో దానిని సముద్రంలో పడేశాడు.

గుండె దిటవు చేసుకుని ఒంటరిగానే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎట్టకేలకు శుక్రవారం ఒడిశాలోని ఖిరిసాహి గ్రామానికి పడవ కొట్టుకు వచ్చింది. మత్స్యకారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అనారోగ్యం పాలైన అమృత్‌ను ఆసుపత్రికి తరలించారు. అండమాన్‌లోని ఆయన కుటుంబానికి సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News