godavari: 30 టన్నుల రాయల్ వశిష్ఠలో మిగిలింది 20 టన్నులే... ఏం చేయాలో తెలియక అధికారుల్లో అయోమయం!
- గత నెల 15న గోదావరిలో మునిగిన బోటు
- 38 రోజుల తరువాత బయటకు వచ్చిన ప్రధాన భాగం
- పైనుంచి ఆదేశాల కోసం వేచిచూస్తున్న అధికారులు
రాయల్ వశిష్ఠ... నెలన్నర క్రితం వరకూ ఎంతో అందమైన లగ్జరీ బోటు. కిన్నెరసాని వంపుల్లో తిరుగుతూ, గోదావరిలో వందలాది మందికి పాపికొండల అందాలను చూపించిన బోటు. గత నెల 15న ఇది 77 మందితో బయలుదేరి కచ్చలూరు వద్ద మునిగిపోగా, 49 మృతదేహాలు లభ్యమయ్యాయి. నీట మునిగిన బోటును తీసేందుకు 38 రోజుల పాటు శ్రమించాల్సి రాగా, వరద కారణంగా ఇసుకలో కూరుకుపోయి ముక్కలు ముక్కలుగా బయటకు వచ్చింది. ఇక ఇప్పుడీ బోటును ఏం చేయాలన్న విషయమై అధికారుల్లో అయోమయం నెలకొంది.
మొత్తం 30 టన్నుల వరకూ బరువుండే బోటు, ఇప్పుడు కేవలం 20 టన్నులు మాత్రమే ఉంది. పూర్తిగా శిథిలమై, కచ్చలూరు వద్ద తీరంలో పడివుంది. దీన్ని బోటు యజమానికి అప్పగించాలా? లేక తుక్కుగా మార్చాలా? పోలీసు కస్టడీలో ఉంచాలా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించలేదు. ఈ బోటుపై కేసు నమోదైనందున దాన్ని కదల్చరాదని పోలీశు శాఖ అంటోంది.
ఇదే సమయంలో పెను విషాదానికి కారణమైన దీని ఆనవాళ్లు కూడా కనిపించకుండా తక్కుగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, పైనుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని అధికారులు అంటున్నారు. కాగా, ఈ బోటు ఇక ఉపయోగపడబోదని బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యం వ్యాఖ్యానించారు.