Narendra Modi: వేలంలో ప్రధాని జ్ఞాపికలు.. మోదీ ఫొటోతో కూడిన పెయింటింగ్ ఖరీదు రూ.25 లక్షలు
- మోదీ తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోకు రూ.20 లక్షలు
- మోదీకి అందిన జ్ఞాపికలను ఢిల్లీలో వేలానికి ఉంచిన కేంద్ర సాంస్కృతిక శాఖ
- మొత్తం 2772 బహుమతుల అమ్మకం
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన జ్ఞాపికల ప్రదర్శనలో ఈ-వేలంలో ఓ అక్రిలిక్ పెయింటింగ్ అత్యధికంగా రూ.25 లక్షలకు అమ్ముడుపోయింది. దేశ ప్రధాని నరేంద్రమోదీ దేశ, విదేశీ పర్యటనల సందర్భంగా వివిధ దేశాల అధిపతులు, అభిమానులు, దేశంలోని పలు సంస్థలు, రాజకీయ నాయకులు ఇచ్చిన 2,772 జ్ఞాపికలను ఈ వేలంలో ఉంచారు. వేలం ద్వారా వచ్చే డబ్బును 'నమామి గంగే మిషన్'కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ వేలంలో జాతిపిత మహాత్మాగాంధీ నిల్చున్న ఫొటోతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా రంగుల్లో చిత్రించిన మోదీ చిత్రం ఉన్న అక్రిలిక్ పెయిటింగ్‌ను ఓ ఔత్సాహికుడు 25 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు.
అలాగే, తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటున్న నరేంద్రమోదీ ఫొటోను రూ.20 లక్షలకు మరో ఔత్సాహికుడు కొనుగోలు చేశాడు. మొత్తం జ్ఞాపికల్లో ఓ వినాయకుని విగ్రహం మాత్రమే అత్యంత తక్కువ ధర రూ.500కు అమ్ముడు పోయింది.