Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు వైసీపీ ప్రభుత్వం భృతి చెల్లించాలి: నారా లోకేశ్ డిమాండ్
- భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
- కృత్రిమ ఇసుక కొరతతో కార్మికులను అప్పులపాలు చేశారు
- ఒక్కో కార్మికుడికి నెలకు పదివేల చొప్పున భృతి చెల్లించాలి
ఏపీలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణకార్మికులు రోడ్డునపడటానికి కారణం సీఎం జగన్ అసమర్థపాలనేనని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారని, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని, సీఎం అయిన తరువాత మాత్రమే రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడిన జగన్, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రాష్ట్రం నుండి బయటకు పంపాలని కక్ష కట్టారని విమర్శించారు.
కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లిన అసమర్థ సీఎం జగన్, J-ట్యాక్స్ తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, టీడీపీ హయాంలో రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను ఇప్పుడు వైసీపీ ఇసుకాసురులు 40 వేల నుండి లక్ష రూపాయలకు అమ్ముకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్మాణ రంగం పడకేసి, కార్మికులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన వైసీపీ ప్రభుత్వం, ఒక్కో కార్మికుడికి నెలకు రూ.10 వేల చొప్పున 50 వేల భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.