Haryana: హర్యానాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థులు
- ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం
- బేషరతుగా మద్దతు ప్రకటించిన ఏడుగురు ఇండిపెండెంట్లు
- మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ
హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 40 సీట్లను గెల్చుకున్న బీజేపీకి అధికారాన్ని చేపట్టేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన వేళ... ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు ప్రకటించారు. వీరి మద్దతుతో బీజేపీ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ (46) కంటే ఒకటి ఎక్కువగానే ఉండబోతోంది.
మరోవైపు, ఢిల్లీలో ఈరోజు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్ లో చండీఘడ్ లోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరే ముందు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో భేటీ అయ్యారు.
మరోవైపు, ఇండిపెండెంట్లు గోపాల్ ఖండా, రణధీర్ గోలన్, బల్రాజ్ కుందూ, రంజిత్ సింగ్, రాకేశ్ దౌలతాబాద్ లు బీజేపీకి ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తున్నామని ప్రకటించారు. వీరంతా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంవీర్ సంఘ్వాన్, ధరంపాల్ గోండార్ లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కాసేపట్లో బీజేపీ అగ్ర నేతలతో వీరు సమావేశం కాబోతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, హర్యానాలో నెలకొన్న పొలిటికల్ టెన్షన్ కు తెర పడింది. కావాల్సినంత మెజార్టీ లభించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనంగా మారింది. ఈ సాయంత్రం మనోహన్ లాల్ ఖట్టర్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.