east coast railway: భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాక్ సర్క్యూట్లు.. పలు రైళ్ల రద్దు
- విజయనగరం స్టేషన్ యార్డ్‌లో నిలిచిన నీరు
- ట్రాక్ సర్క్యూట్లు దెబ్బతినడంతో రైళ్లను రద్దు చేసిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే
- ప్రయాణికులు గమనించాలని సూచన
భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ యార్డ్‌లో నీరు నిలిచిపోయి ట్రాక్ సర్క్యూట్లు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో నేడు బెర్హంపూర్-విశాఖపట్టణం మధ్య నడవాల్సిన ప్యాసింజర్ (58525) రైలు, విశాఖలో నిన్న బయలుదేరాల్సిన విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(22820), నేడు భువనేశ్వర్‌లో బయలుదేరాల్సిన భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(22819)లను రద్దు చేసినట్టు తెలిపారు.
అలాగే, నిన్న విశాఖలో బయలుదేరాల్సిన విశాఖపట్నం-బెర్హంపూర్ పాసింజర్ (58526)రైలును కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జగదల్‌పూర్-భువనేశ్వర్ మధ్య నడిచే హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) రైలును రీషెడ్యూల్ చేసినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.