Jagan: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం: ఏపీ సీఎం జగన్

  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరముంది
  • స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు చట్టం చేశాం
  • ప్లాస్టిక్ ఇంజినీరింగ్ లో శిక్షణ పొందినవారికి మంచి అవకాశాలున్నాయి

రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం సూరంపల్లిలో కొత్తగా నిర్మించిన సీపెట్ (సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ) భవనాలను కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి ప్రారంభించారు.

తొలుత సీఫెట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇంకా పెంచాల్సిన అవసరముంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో స్థానికులకే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టం చేశాం. ప్లాస్టిక్ ఇంజినీరింగ్ లో శిక్షణ పొందినవారికి మంచి అవకాశాలున్నాయి. త్వరలో 25 పార్లమెంట్ నియోజక వర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తాం, ఇందుకు కేంద్ర సాయం కోరాం’ అని అన్నారు. రాష్ట్రంలో మరో సీపెట్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న తన విజ్ఞప్తికి కేంద్రమంత్రి సదానంద గౌడ సానుకూలంగా స్పందించారని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News