ashwathama reddy: మా డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదు: టీఎస్ ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి
- కార్మిక సంఘాలను చర్చలకు పిలవాల్సిందే
- ఈడీలు, బేడీల కమిటీలపై మాకు విశ్వాసం లేదు
- 30న సరూర్ నగర్ లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని పిలుపు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని, తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈరోజు ధర్నాచౌక్ లో ఆయన మాట్లాడారు. తాము లేవనెత్తిన 26 డిమాండ్లలో ఏ ఒక్కదాని నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వం, కార్మిక సంఘాలను చర్చలకు పిలవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈడీలు, బేడీల కమిటీలపై తమకు విశ్వాసం లేదని చెప్పారు. ఇప్పటి వరకు వీరు కన్పించలేదని, అకస్మాత్తుగా వారిని తెరమీదకు తీసుకువస్తున్నారెందుకు అంటూ ప్రశ్నించారు.
రేపు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త రాస్తారోకో కార్యక్రమాలను వాయిదా వేశామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు వారిని వదిలేశారని అన్నారు. సిగ్గు, శరం లేకుండా పూటకో మాట మారుస్తున్నారని మండిపడ్డారు. రవాణా వ్యవస్థను మాఫియాగా మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. 30న సరూర్ నగర్ లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని కోరారు. రేపు అన్ని పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు తమ సమస్యలపై వివరిస్తామన్నారు.