Dushyant Chowtala: హర్యానాలో దుశ్యంత్ మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ పరుగులు!
- 11 చోట్ల గెలవబోతున్న జేజేపీ
- సంప్రదింపులు ప్రారంభించిన బీజేపీ
- ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిన కాంగ్రెస్
- కింగ్ మేకర్ గా మారనున్న దుశ్యంత్ చౌతాలా
దుశ్యంత్ చౌతాలా... జననాయక్ జనతా పార్టీ అధినేత. ఈ పార్టీ పేరు, దుశ్యంత్ పేరు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. హర్యానా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని తేలడంతో, ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి 11 స్థానాల్లో విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న జేజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు అత్యంత కీలకమైంది. దుశ్యంత్ చౌతాలా కింగ్ మేకర్ గా మారాడు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుశ్యంత్ తో సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
బీజేపీ తరఫున ఆ పార్టీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దళ్ నేతలు దుశ్యంత్ తో చర్చలు ప్రారంభించారు. మరోవైపు తమకు మద్దతిస్తే, డిప్యూటీ సీఎం పదవిని దుశ్యంత్ కు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుత ఫలితాల సరళి ప్రకారం బీజేపీ 39, కాంగ్రెస్ 29, ఐఎన్ఎల్డీ కూటమి 2, జేజేపీ 11, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇదే సరళి కొనసాగితే మేజిక్ ఫిగర్ 46 సీట్లను ఏ పార్టీ చేరుకునే పరిస్థితి ఉండదు. అప్పుడిక హంగ్ అనివార్యం. దుశ్యంత్ చౌతాలా కీలకం.