Virat Kohli: ఆ నిర్ణయాన్ని కోహ్లీకే వదిలేస్తున్నా: గంగూలీ
- నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్
- ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కోహ్లీకే వదిలేస్తున్నా
- ఈ నెల 24న కోహ్లీని కలుస్తున్నా
నవంబర్ 3 నుంచి భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ఈ సిరీస్ కు అందుబాటులో ఉండాలో? లేదో? కోహ్లీనే నిర్ణయించుకోవాలని అన్నారు. అన్ని ఫార్మాట్లతో కలిపి గత 56 అంతర్జాతీయ మ్యాచ్ లలో 48 మ్యాచ్ లను కోహ్లీ ఆడాడు. ఈ నేపథ్యంలో, బాంగ్లాదేశ్ తో జరగబోయే టీ20 మ్యాచ్ లకు కోహ్లీ దూరంగా ఉండబోతున్నాడని... ఆ తర్వాత జరిగే టెస్టు మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు గంగూలీ సమాధానమిచ్చారు.
'ఈ నెల 24న కోహ్లీని నేను కలుస్తున్నా. టీమిండియా కెప్టెన్ తో బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో అతనితో మాట్లాడబోతున్నా' అని గంగూలీ చెప్పారు. మ్యాచ్ ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కెప్టెన్ కోహ్లీకే వదిలేస్తున్నానని తెలిపారు. ఇదే సందర్భంలో, రోహిత్ శర్మపై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. రోహిత్ శర్మ ఒక గొప్ప బ్యాట్స్ మెన్ అని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అతను ఏం సాధించగలడో మనందరికీ తెలుసని చెప్పారు. ఉమేశ్ యాదవ్ బ్రిలియంట్ అని కితాబిచ్చారు. ఎక్కువ బౌన్స్ ఉండని భారత పిచ్ లపై తన వైవిధ్యభరితమైన బంతులతో అద్భుతంగా రాణించాడని ప్రశంసించారు.