Khammam District: అనారోగ్యంతో ఖమ్మం న్యాయమూర్తి జయమ్మ మృతి
- ప్రాణం తీసిన విష జ్వరం
- పది రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స
- జయమ్మది మహబూబ్‌నగర్ జిల్లా
ఖమ్మం పట్టణ రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం.జయమ్మ (45) నిన్న రాత్రి చనిపోయారు. విషజ్వరం బారిన పడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయమ్మ స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా హన్వడ మండలం అయోధ్యనగర్. హైకోర్టు విభజనలో భాగంగా జయమ్మ సత్తెనపల్లి నుంచి ఖమ్మం కోర్టుకు బదిలీపై వచ్చారు. కొన్నాళ్ల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆమె స్థానికంగా వైద్య సహాయం పొందారు.
పది రోజుల క్రితం పరిస్థితి తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే నిన్నరాత్రి పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. జయమ్మకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె మృతికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు.