Viral Videos: మహిళలకు కావాల్సింది బంగారం కాదట!: ధనత్రయోదశి రోజు ఏం కొనాలో చెప్పిన యువతులు..వీడియో వైరల్
- ధన త్రయోదశి నాడు బంగారం బదులు ‘ఐరన్’ కొనాలని సూచన
- దేశంలో 53 శాతం మంది మహిళలకు ఐరన్ లోపం
- ఆకట్టుకుంటున్న సందేశాత్మక వీడియో
ధనత్రయోదశి వస్తుందంటే చాలు మహిళల మనసు బంగారంపైకి మళ్లుతుంది. అయితే, నిజానికి మహిళలకు కావాల్సింది బంగారం కాదని.. ఇనుము అంటూ డీఎస్ఎం అనే సంస్థ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ‘ప్రాజెక్ట్ స్త్రీధన్’ పేరుతో ఈ సంస్థ పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి చక్కని వీడియోను రూపొందించింది. 2018 జనవరిలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ –4) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 53 శాతం మంది మహిళలు రక్తహీనత (ఎనీమియా)తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ధన త్రయోదశి నాడు బంగారం కొనేందుకు ఉపయోగించే డబ్బుతో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తినాలనేది ఈ వీడియో సారాంశం.