Isro: జాబిల్లిపై మళ్లీ ప్రారంభమైన పరిశోధనలు.. ఫొటోలు పంపిన చంద్రయాన్-2 ఆర్బిటర్
- రెండువారాల అనంతరం తిరిగి ఫొటోలు పంపిన ఆర్బిటర్
- చంద్రుడిపై వెలుగు ప్రసరించిన ప్రాంతం ఫొటోలు పంపిన వైనం
- ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ పని మొదలుపెట్టింది. చంద్రుడి ఉత్తరార్ధ గోళంపై రెండు వారాలపాటు చీకటి రాజ్యమేలడంతో ఫొటోలు పంపలేకపోయిన ఆర్బిటర్.. ఇప్పుడిప్పుడే కాంతి ప్రసరిస్తుండడంతో ఆ ఫొటోలను పంపింది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-2 ఆర్బిటర్ తిరిగి పరిశోధనలు ప్రారంభించిందని పేర్కొంది. ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) చంద్రుడిపై కాంతి ప్రసరించిన కొంత భాగాన్ని చిత్రీకరించి పంపిందంటూ ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో బిలాలు, సోమర్‌ఫీల్డ్, స్టెబిన్స్, కిర్క్‌ఉడ్‌లు స్పష్టంగా కనబడుతున్నాయి.